మరో రెండు గంటల్లో గ్లోబ్ ట్రోటర్... హడావుడి షురూ!

ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌ మొదలవబోతోంది. కనుక మధ్యాహ్నం నుంచే అక్కడ అభిమానుల హడావుడి మొదలైపోయింది. ఈ సందర్భంగా రాజమౌళి అభిమానులకు సంతోషం కలిగించే మరో విషయం చెప్పారు.

ఈరోజు ఈవెంట్‌లో సినిమా టైటిల్‌ ప్రకటిస్తామని, అలాగే సినిమాకి సంబంధించి కొన్ని విజువల్స్ కూడా చూపిస్తామని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీని కోసం 100 అడుగుల భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అక్కడ విజువల్స్ ప్రదర్శించిన తర్వాత ఆన్‌లైన్‌లో కూడా విడుదల చేస్తామని రాజమౌళి చెప్పారు. 

ఆయన కూడా మహేష్ బాబులాగే ఈ ఈవెంట్‌కి వచ్చేవారు పాటించాల్సిన నియమ నిబంధనలు గురించి వివరించి అందరూ వాటి ప్రకారమే నడుచుకుంటూ పోలీసులకు, నిర్వాహకులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

కనీవినీ ఎరుగని స్థాయిలో చాలా అట్టహాసంగా ఈ ఈవెంట్‌ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ సందర్భంగా మూడు నాలుగు రోజుల క్రితమే ఈ సినిమాలో విలన్‌ కుంభగా పృధ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌, తర్వాత మందాకినిగా నటిస్తున్న ప్రియాంకా చోప్రా పోస్టర్‌ విడుదల చేశారు.