నువ్వు ఐబొమ్మయితే... మేము సైబర్ క్రైమ్‌ పోలీసులం!

తెలుగుతో సహా పలు భాషలలో విడుదలైన సినిమాలను పైరసీ చేస్తుండే ఐబొమ్మ వెబ్‌సైట్‌ యజమాని, నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం హైదరాబాద్‌, కూకట్‌పల్లిలో అరెస్ట్‌ చేశారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్‌సైట్‌ నడిపిస్తుండే రవి, దమ్ముంటే తనని పట్టుకోమని సైబర్ క్రైమ్‌ పోలీసులకు సవాలు విసిరాడు.

అంతేకాదు... తన జోలికి వస్తే సినీ ప్రముఖుల బండారం బయటపెడతానని బ్లాక్ మెయిల్ కూడా చేశాడు.

అప్పటి నుంచి అతనిపై నిఘా పెట్టిన సైబర్ క్రైమ్‌ పోలీసులు, నిన్న హైదరాబాద్‌ వచ్చినప్పుడు అరెస్ట్‌ చేశారు. అతనితో పాటు అతని కోసం పనిచేస్తున్న కొందరు ఏజంట్లను కూడా అరెస్ట్‌ చేశారు. ఇమ్మడి రవి బ్యాంక్ ఖాతాలో రూ.3 కోట్లు అతను ఉపయోగించకుండా నిలిపివేయించారు.

ఈ పైరసీ రాకెట్‌లో ఇంకా ఎవరెవరున్నారు? ఏవిదంగా కొత్త సినిమాలు దొంగతనం చేస్తారు? వాటిని రిలీజ్ చేస్తామని చెప్పి ఎవరెవరిని బెదిరించారు? ఎవరెవరి నుంచి ఎంత సొమ్ము వసూలు చేశారు?వంటి వివరాలు రాబడుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుని, పైరసీకి పాల్పడుతున ముఠాని అరెస్ట్‌ చేయగలిగితే సినీ పరిశ్రమకు కాస్త ఊరట లభిస్తుంది.