
తెలుగు పాటకి చిరునామాగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం అకాల మరణం సంగీత ప్రియులను శోక సముద్రంలో ముంచెత్తింది. బాలు మనతో లేరు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మళయాళంతో పాటుగా మరో 11 భాషల్లో పాటలు పాడారు బాలు. ఐదు దశాబ్ధాల సంగీత ప్రస్థానంలో 40 వేల పాటలు పైగా పాడారు.
అలాంటి బాలసుబ్రహ్మణ్యం కు భారత రత్న ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. బాలు ఎంతోమంది గాయకులను పరిచయం చేయడంతో పాటు 50 సంవత్సరాల పాటు సంగీత ప్రియులను అలరించారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన బాలు ఎన్నో జాతీయ అవార్డులను అందుకున్నారు. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ బాలుకి ప్రధానం చేశారు. నేపథ్య గాయకురాలు లతా మంగేస్కర్, భుపెన్ హజారిక, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, బిస్మిల్లా ఖాన్, భీం సేన్ జోషి లకు భారతరత్న అందించారు. వారితో పాటుగా బాలసుబ్రహ్మణ్యంకు భారరత్న ఇవ్వాలని వైఎస్ జగన్ ప్రధాని మోదీ లేఖలో పేర్కొన్నారు.