ఈమెయిల్ లో సెన్సార్ సర్టిఫికెట్..!

కరోనా సంక్షోభంతో సినిమా పరిశ్రమ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే చాల సినిమాలు రిలీజ్ అవకుండా ఆగిపోగా.. కొన్ని సినిమాలు సెన్సార్ కోసం ఎదురుచూస్తున్నాయి. చిన్న సినిమాల నిర్మాతలు సినిమా సెన్సార్ పూర్తయితే ఓటిటిలో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న సినిమాల నిర్మాతలు ఎక్కువ ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వారు తమ సినిమాలకు సెన్సార్ చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై హైదరాబాద్ సెన్సార్ బోర్డు అధికారి వి.బాలకృష్ణ స్పందన తెలియచేశారు.     

దేశంలో ఉన్న ముఖ్యమైన నగరాల్లో ప్రాంతీయ సెన్సార్ కార్యాలయ అధికారులతో చర్చించగా.. రెండు అంశాల మీద నిర్మాతలకు వెసులుబాటు కల్పించేలా నిర్ణయాలు తీసుకున్నట్టు బాలకృష్ణ వెళ్లడించారు. లాక్ డౌన్ వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు, అందుకే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత త్వరగా సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేలా చేస్తారని అన్నారు. సినిమా సెన్సార్ కు నిర్మాతలు హాజరుకాకున్నా ఆన్ లైన్ లో సంప్రదించి.. ఈ మెయిల్ ద్వారా సర్టిఫికెట్ పొందవచ్చని తెలిపారు. నిర్మాతలు కోరుకున్న చోట సెన్సార్ ఏర్పాట్లు చేసి.. సినిమాను హార్డ్ డిస్క్, క్యూబ్ లలో తీసుకొచ్చినా సెన్సార్ చేస్తామని బాలకృష్ణ చెప్పడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు.