
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న వారణాశి సినిమా ఫస్ట్ గ్లిమ్స్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడి పాత్ర కూడా చేశారని రాజమౌళి స్వయంగా వెల్లండించారు.
ఆ పాత్రలో మహేష్ బాబు చాలా అద్భుతంగా ఉన్నారని, ఆ పాత్ర చేయడం కోసం ఆయన ఎంతగానో శ్రమించారని చెప్పారు. ఆ శ్రీరాముడి పాత్రలో సన్నివేశాలు తీసేందుకే తమకు రెండు నెలలు పట్టిందని రాజమౌళి చెప్పారు.
"శ్రీరాముడి వేషధారణలో మహేష్ బాబు ఫోటోని కొన్ని రోజులు నా ఫోన్‌లో వాల్ పేపర్‌గా పెట్టుకున్నాను. కానీ దానిని ఎవరైనా చూసి కాపీ చేసి లీక్ చేస్తారని తీసేశాను. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ నేను చెప్పింది నిజమేనని ఒప్పుకుంటారు," అని అన్నారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు గురించి చాలా మందికి తెలియని ఓ కొత్త విషయం కూడా రాజమౌళి చెప్పారు. "మనందరం మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే బ్రతకలేమన్నట్లు ఉంటాము. కానీ మహేష్ బాబు సెట్స్‌లోకి వస్తున్నప్పుడే తన మొబైల్ ఫోన్‌ని కారులో పెట్టి వచ్చేస్తారు. షూటింగ్ పూర్తయ్యాకనే వెళ్ళి ఫోన్ చూస్తారు. నేను కూడా మహేష్ బాబులా ఫోన్‌ని దూరం పెట్టడం అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను," అని అన్నారు.