బాలీవుడ్ నటుడు రిషి కపూర్ కన్నుమూత

బాలీవుడ్ నటుడు రిషి కపూర్ (67) కన్నుమూశారు. క్యాన్సర్ తో బాధపడుతున్న రిషి కపూర్ ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న రిషి కపూర్ శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతుండటంతో ముంబైలోని హెచ్.ఎన్ రిలయన్స్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు.   

మేరా నామ్ జోకర్ సినిమాతో బాలనటుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రిషి కపూర్ బాబీ చిత్రంతో హీరోగా మారారు. తొలి చిత్రంతోనే ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకున్న రిషి కపూర్ జిందా దిల్, రాజా, అమర్ అక్బర్ ఆంటోనీ, సర్గమ్‌, పతీపత్నీఔర్ ఓ..,కర్జ్‌, కూలీ, దునియా, నగీనా, దూస్రా ఆద్మీ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. రిషి కపూర్ తనయుడు రణ్ భీర్ కపూర్ బాలీవుడ్ హీరోగా రాణిస్తున్నారు. బుధవారం ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందగా.. ఈరోజు రిషి కపూర్ మరణ వార్తతో బాలీవుడ్ షాక్ కు గురైంది.