
ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థత లోనవడంతో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజీగూడలోని యశోదా ఆసుపత్రిలో చేర్చారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు హటాత్తుగా కోమాలోకి వెళ్ళిపోయారు. ఆసుపత్రిలో చేర్చగానే వెంటిలేటరుపై ఉంచి డయాలసిస్ (రక్తశుద్ది) ప్రక్రియను ప్రారంభించారని నర్సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
1963, మే15నా హైదరాబాద్‌లో జన్మించిన మైలా నరసింహ యాదవ్ విజయనిర్మల దర్శకత్వం వహించిన హేమాహేమీలు సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి 300కు పైగా తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో విభిన్నపాత్రలలో నటించారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన చాలా సినిమాలలో నర్సింగ్ యాదవ్ నటించిన సంగతి తెలిసిందే. శంకర్ దాదా ఎంబీబీఎస్, కిక్, రేసుగుర్రం, ఖైదీ నెంబర్ 150 తదితర చిత్రాలలో నటించారు. ఆయనకు భార్య చిత్రా, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రజలందరి అభిమానాన్ని సంపాదించుకొన్న నర్సింగ్ యాదవ్ త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి చేరుకోవాలని భగవంతుని ప్రార్ధిద్దాం.
గమనిక: మీ కంప్యూటర్లలో, మొబైల్ ఫోన్లలో www.mytelangana.com ను బుక్ మార్క్ చేసుకొని నేరుగా మా వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా కోరుతున్నాము.