
కోలీవుడ్ హీరోలకు తెలుగు మార్కెట్ పై ఎప్పుడు ఓ కన్ను ఉంటుంది. రజినికాంత్, కమల్ హాసన్ నుండి సూర్య, కార్తి, విక్రం ఇలా అందరు తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచారు. వారు తమిళంలోనే కాదు తెలుగులో కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే వీరందరితో పాటుగా కోలీవుడ్ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ కూడా తెలుగులో క్రేజ్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని అతనికి ఇక్కడ పెద్దగా మార్కెట్ రావట్లేదు. తన సినిమాలు అన్ని తమిళంతో పాటుగా తెలుగులో రిలీజ్ అవుతున్నా అంత గొప్ప ఫలితాలను మాత్రం అందుకోవట్లేదు.
అయినా సరే విజయ్ ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతూనే ఉంది. తుపాకి తర్వాత విజయ్ సినిమాలు ఏవి తెలుగులో పెద్దగా ఆడలేదు. రీసెంట్ మూవీ బిగిల్ కూడా 10 కోట్లకు తెలుగు రైట్స్ కొనగా టోటల్ రన్ లో 7 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ లో మహేష్ ఎస్ కోనేరు బిగిల్ అదే విజిల్ ను తెలుగులో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు రాబోతున్న మాస్టర్ సినిమాను కూడా మహేష్ కొన్నారని తెలుస్తుంది. లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 12.5 కోట్లకు కొన్నారట. అంతేకాదు ఈసారి విజయ్ ను కూడా తెలుగు ప్రమోషన్స్ కు తెస్తారని తెలుస్తుంది. మరి మాస్టర్ అయినా విజయ్ కు తెలుగులో సూపర్ హిట్ అందిస్తుందో లేదో చూడాలి.