'మా' నరేష్ పై మళ్లీ అసంతృప్తి..!

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడు నరేష్ మీద అసంతృప్తిని వ్యక్తపరుస్తూ 'మా' ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు. తొమ్మిది పేజీల లేఖలో నరేష్ 'మా' నిధుల దుర్వినియోగం.. ఈసి మెంబర్స్ అవమానించడం విషయాలపై ప్రస్థావించారు. నరేష్ ఒంటెద్దు పోకడతో 'మా' పూర్తిగా నష్టపోతుందని.. ప్రస్తుతం ఆయన ఏమి పట్టించుకునే పరిస్థితిలో లేరని లేఖలో ప్రధానంగా ప్రస్థావించారు 'మా' ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్. 

'మా' కొత్త ప్యానెల్ ఏర్పడిన నాటి నుండి ఈరోజు వరకు వారానికో గొడవ జరుగుతూనే ఉంది. కొన్నాళ్లు మాజీ అధ్యక్షుడు శివాజిరాజా నరేష్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేయగా ఆ తర్వాత ప్యానెల్ సభ్యులే నరేష్ మీద గొడవకు దిగారు. ఈమధ్య జరిగిన 'మా' డైరీ ఆవిష్కరణలో రాజశేఖర్ సభాముఖంగానే తన అసంతృప్తిని వెళ్లబుచ్చారు. చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు వంటి పెద్దలు కలుగచేసుకున్నా సరే నరేష్ తన ప్రవర్తన మార్చుకోవడం లేదని తెలుస్తుంది. మరి ఈ లేఖతో అయినా నరేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అతన్ని సెట్ రైట్ అయ్యేలా చేస్తారా లేదా అధ్యక్షుడిగా అతన్ని తీసేసి వేరొకరిని పెడతారా అన్నది తెలియాల్సి ఉంది.