రేంజ్‌ రోవర్‌తో ప్రతిరోజు పండుగే

గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా మూవీ ప్రతిరోజు పండుగే చిత్రం మూడవ వారంలో కూడా మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం దాదాపుగా 33 కోట్ల వసూళ్లను సాధించిందని, లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం 35 నుండి 36 కోట్ల వరకు రాబట్టడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పదిహేను కోట్ల లోపు బడ్జెట్‌తోనే ఈ చిత్రం రూపొందినట్లుగా సమాచారం అందుతోంది. 20 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసిన ఈ చిత్రం ఇప్పుడు 33 కోట్ల వరకు వసూళ్లను సాధించడంతో నిర్మాతలు భారీగా లాభం పొందారు. 

ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌లో వంశీ మరియు ప్రమోద్‌లు నిర్మించిన విషయం తెల్సిందే. భారీ ఎత్తున లాభాలు రావడంతో తాజాగా నిర్మాత వంశీ దర్శకుడు మారుతికి రేంజ్‌ రోవర్‌ కారును బహుమానంగా ఇచ్చాడు. దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఈ బహుమానం అందుకున్న మారుతి తన ఆనందాన్ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నాడు. నీలాంటి స్నేహితుడు ఉంటే ప్రతి రోజు పండుగే, థ్యాంక్స్‌ వంశీ డార్లింగ్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. గతంలో పలువురు దర్శకులు కార్లను బహుమానంగా దక్కించుకున్నారు. కాని రేంజ్‌ రోవర్‌ కారును బహుమానంగా దర్కించుకుంది మాత్రం కేవలం మారుతి అయ్యి ఉంటాడు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.