
సూపర్ స్టార్ రజినికాంత్, ఏ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా దర్బార్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ ఈ సినిమా నిర్మించారు. రజిని సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ అవుతుంది. తమిళంతో పాటుగా తెలుగు, హింది భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది.
చిత్రయూనిట్ సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజినికాంత్ స్పీచ్ అందరిని మెప్పించింది. 70 ఏళ్లు వచ్చినా తను ఇంకా సినిమాలు చేస్తున్నా అంటే అది మీ అభిమానమే అంటూ ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు రజినికాంత్. అంతులేని కథ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమయ్యానని.. తమిళ ప్రేక్షకుల లానే తెలుగు వారు కూడా తనని ఇష్టపడ్డారని అది తన భాగ్యమని అన్నారు రజినికాంత్. మురుగదాస్ తో 15 ఏళ్లుగా సినిమా చేయాలని ప్రయత్నిస్తుంటే ఇన్నాళ్లకు అది కుదిరిందని ఇది అందరికి నచ్చే సినిమా అని అన్నారు.
ప్రతి సినిమా చేసే టైంలో అందులో ఒక మ్యాజిక్ తెలుస్తుందని.. అదే మ్యాజిక్ తో సినిమా హిట్ అవుతుందని.. దర్బార్ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఆ మ్యాజిక్ జరిగిందని ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అన్నారు రజిని. తెలుగులో సినిమాలు రిలీజ్ అవుతున్నా ఎప్పుడు ఇలాంటి పెద్ద ఫంక్షన్ జరుగలేదు. దర్బార్ ముందే హిట్ అవుతుందని ఎన్వి ప్రసాద్ నమ్మారు అందుకే ఇలాంటి భారీ ఈవెంట్ నిర్వహించారని అన్నారు రజిని. ముఖ్యంగా తన స్పీచ్ మొత్తం తెలుగులో మాట్లాడి తన స్పెషాలిటీ చాటుకున్నారు సూపర్ స్టార్ రజినికాంత్.