సీనియర్ నటి గీతాంజలి కన్నుమూత

సీనియర్ నటి గీతాంజలి బుధవారం రాత్రి అపోలో హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో గీతాంజలిని కుటుంబ సభ్యులు అపోలో హాస్పిటల్ లో చేర్పించగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న టైంలోనే రాత్రి 11:45 గంటలకు మరొసారి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. శ్రీరామమూర్తి, శ్యామసుందరి దంపతులకు కాకినాడలో జన్మించారు గీతాంజలి. సౌత్ లో అన్ని భాషల్లోనూ ఆమె నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోనే కాదు హిందిలో కూడా గీతాంజలి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు.       

1961లో సీతారామ కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు గీతాంజలి. గీతాంజలి అసలు పేరు మణి. పారిస్ మణి అనే హింది సినిమాలో నటిస్తున్న సమయంలో టైటిల్ లో మణి ఉందని ఈమె పేరుని గీతాంజలిగా మార్చారు ఆ చిత్ర నిర్మాతలు. చిన్ననాటి నుండి కళల మీద ఆసక్తి ఎక్కువ ఉండటం వల్ల ఆమె నటిగా కూడా రాణించడం జరిగింది. డా. చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, గూఢచారి 116, దేవత, నిర్దోషి, శ్రీ శ్రీ మర్యాదరామన్న, గ్రీకువీరుడు, మాయాజాలం సినిమాల్లో గీతాంజలి నటించారు. గీతాంజలి తన సహ నటుడు రామకృష్ణ గారిని పెళ్లాడారు.