
హరీష్ శంకర్ డైరక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్ తండా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఈ నెల 20న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాను అడ్డుకుంటామని అంటున్నారు బోయ కమ్యునిటీ నేతలు.
వాల్మీకిని గ్యాంగ్ స్టర్ గా చూపించడం వల్ల తమ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయని.. గ్యాంగ్ స్టర్ మూవీకి వాల్మీకి పేరు పెట్టడాన్ని వారు తప్పుపడుతున్నారు. వెంటనే సినిమా టైటిల్ మార్చాలని లేదంటే సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని చెబుతున్నారు. ఇక వాల్మీకి టైటిల్ మార్చాలంటూ బోయ సామాజిక వర్గ నేతలంతా బి.జే.పి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ను కలిశారు. తమ జాతి గురువైన వాల్మీకిని రాబోయే తరాలకు గ్యాంగ్ స్టర్ గా చూపించాలని ప్రయత్నిస్తున్నారని బోయ సామాజిక వర్గ నేతలు అన్నారు. అయితే రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ చేస్తున్నారు కాని ఈ టైటిల్ వివాదం గురించి మాత్రం పట్టించుకోవడం లేదు.