
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పై హైదరాబాద్ కె.పి.హెచ్.బి కాలనీ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. కె.పి.హెచ్.బి కాలనీ 3వ ఫేజ్ లో కల్ట్ ఫిట్ నెస్ సెంటర్ లో తనకు జరిగిన అసౌకర్యానికి హృతిక్ రోషన్ కారణమంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు శశికాంత్. ఇంతకీ అసలు ఎందుకు హృతి రోషన్ పై కేసు పెట్టాడంటే.. కల్ట్ ఫిట్ నెస్ సెంటర్ లో బరువు తగ్గేందుకు స్పెషల్ ప్యాజీలు ఉంటాయి. 17,490 నుండి 36,700 రూపాయల వరకు ప్యాకేజీల ధర నిర్ణయించబడింది. ఈ సంస్థకు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
అందుకే ఈ ఫిట్ నెస్ సెంటర్ లో ఎక్కువమంది చేరారు. అయితే పరిమితికి మించి అభ్యర్ధులను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల టైమ్ స్లాట్ బుక్ అవడం లేదట. దీని వల్ల డబ్బులు చెల్లించిన వారు ఇబ్బంది పడాల్సి వస్తుందట. దీనిపై అక్కడ మేనేజ్మెంట్ నుండి సరైన సమాధానం రాకపోవడంతో శశికాంత్ అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కె.పి.హెచ్.బి కల్ట్ ఫిట్ నెస్ సెంటర్ లో పనిచేస్తున్న మేనేజర్ సుబ్రహ్మణ్యం, డైరక్టర్ ముఖేష్ బాంచల్, సిఈవో అంకిత్ లతో పాటుగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న హృతిక్ రోషన్ పేరుని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు శశికాంత్. ఈ కేసు విషయంపై హృతిక్ రోషన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.