
స్వీటీ అనుష్క మళ్లీ వరుస సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. భాగమతి తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన అనుష్క ప్రస్తుతం కోనా వెంకట్ నిర్మాణంలో సీక్రెట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి సైరా నరసిం హా రెడ్డి సినిమాలో కూడా అనుష్క నటిస్తుందని తెలుస్తుంది. నయనతార లీడ్ హీరోయిన్ గా నటిస్తున్న సైరాలో తమన్నా స్పెషల్ రోల్ చేస్తుంది. ఇక ఈ ఇద్దరు చాలరు అన్నట్టుగా ఇప్పుడు అనుష్కను సైరాలో సెలెక్ట్ చేశారట.
సైరాలో అనుష్క వాయిస్ ఓవర్ ఇస్తుందని అన్నారు కాని ఓ స్పెషల్ సాంగ్ కోసం అనుష్కతో సంప్రదింపులు జరిపారట. సైరాలో స్పెషల్ సాంగ్ ఏంటని అనుకోవచ్చు.. దర్శక నిర్మాతలు తలచుకోవాలే కాని ఏదైనా చేస్తారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో అనుష్క స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతుందట. ఆల్రెడీ 13 ఏళ్ల క్రితం స్టాలిన్ సినిమాలో అనుష్క చిరంజీవితో స్టెప్పులేసింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ లక్కీ ఛాన్స్ అందుకుంది. ఇక ఇదే కాకుండా మరో రెండు క్రేజీ ఛాన్సులు అనుష్క చేతిలో ఉన్నాయని టాక్. మొత్తానికి అనుష్క మళ్లీ మునుపటి ఫాంలోకి వచ్చేసినట్టే కనిపిస్తుంది.
సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సైరా సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తుంది. రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది.