
ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్దె ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో కూడా నటించింది. రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో బాలీవుడ్ లో హృటిక్ రోషన్ కు జోడీగా మొహెంజోదారో సినిమాలో నటించింది. భారీ బడ్జెట్ తో తారాస్థాయి అంచనాలతో వచ్చిన ఆ సినిమా కూడా ఫెయిల్ అయ్యే సరికి అమ్మడికి ఐరన్ లెగ్ అన్న ముద్ర పడ్డది. అయితే అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథ్ ఆమె ఫేట్ మార్చేసింది.
ఆ తర్వాత వరుస స్టార్ ఛాన్సులు పట్టేస్తున్న పూజా హెగ్దె లేటెస్ట్ గా మహేష్ మహర్షి సినిమాలో నటించింది. ఈ సినిమా 9న రిలీజ్ అవుతుంది. ఇక మహర్షితో పాటుగా ప్రభాస్, రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా కూడా చేస్తుంది పూజా హెగ్దె. త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూవీకి ఈ బ్యూటీనే ఫైనల్ చేశారు. ఇన్ని వరుస ఛాన్సులతో పాటుగా వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో కూడా అవకాశం దక్కించుకుందట.
కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా జిగుర్తండా రీమేక్ గా వస్తున్న వాల్మీకి సినిమాలో పూజా హెగ్దె నటిస్తుందట. ఈ సినిమా కోసం జస్ట్ 15 రోజుల కాల్ షీట్స్ కు ఆమె 2 కోట్లు డిమాండ్ చేసిందని తెలుస్తుంది. పూజా హెగ్దె అయితే ప్రాజెక్ట్ కు మరింత క్రేజ్ వస్తుందని భావించి ఆమె అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమయ్యారట దర్శక నిర్మాతలు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే పూజా మొదటి సినిమా ముకుందలో వరుణ్ తేజ్ హీరోగా చేశాడు. సో స్టార్స్ మారాక ఇద్దరు కలిసి చేస్తున్న వాల్మీకి ఈ విధంగా కూడా క్రేజ్ తెచ్చుకుంటుంది.