రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మియాపూర్ భూకుంభకోణం కేసుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై అదనపు అఫిడవిట్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్ధనను మన్నించి, ఈ కేసు విచారణను నాలుగు వారాలకు కోర్టు వాయిదా వేసింది.
మియాపూర్ రిజిస్త్రార్ కార్యాలయంలో ఏదో గూడుపుఠానీ జరుగుతోందని అనుమానించిన మేడ్చల్ జిల్లా మేజిస్ట్రేట్ ఎన్.సైదిరెడ్డి పోలీసులకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పిర్యాదు చేయడంతో తీగ లాగితే డొంక కదిలినట్లు సుమారు రూ.10,000 కోట్ల కుంభకోణం బయటపడింది. కానీ ఆ భూముల మార్కెట్ విలువ సుమారు రూ.40,000 కోట్లు పైనే ఉంటుందని అంచనాలున్నాయి.
పి.ఎస్.ప్రసాద్ మరికొందరు వ్యక్తులు కలిసి వివిధ సర్వే నెంబర్లలో గల 691 ఎకరాలకు నకిలీ పట్టాలు సృష్టించి, ఆ భూములను తమ పేరుపై రిజిస్టర్ చేయించుకొన్నట్లు దర్యాప్తులో తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ రిజిస్ట్రేషన్లన్నిటినీ రద్దు చేసి విచారణకు ఆదేశించింది. ఆ భూములన్నీ ప్రస్తుతం ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నప్పటికీ, ఈ కోర్టు వివాదం తేలి వాటిని కోర్టు ప్రభుత్వానికి అప్పగించేవరకు అవి వివాదాస్పద భూములుగానే పరిగణింపబడతాయి. కానీ ఈ కేసు విచారణ ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేరు. కనుక అంతవరకు ఆ భూములపై యధాతధ స్థితిని కొనసాగే అవకాశాలే ఉన్నాయి.