మూడేళ్ళలోనే కాళేశ్వరం పూర్తి... 87 ఏళ్ళలో పోలవరం కాలేదు!

బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఈరోజు ఓ సభలో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం గురించి 1940లో ఆలోచన చేస్తే 1980లో దానికి శంకుస్థాపన జరిగింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత అంటే 2014 జూన్‌ తర్వాత దాని పనులు జోరందుకున్నాయి. కానీ నేటికీ ఆ ప్రాజెక్ట్ పూర్తికాలేదు. 2027 డిసెంబర్‌కి పూర్తవుతుందని చెపుతున్నారు. ఎక్కడ 1940 ఎక్కడ 2027? 

కానీ మన కేసీఆర్‌గారు 2016లో కాళేశ్వరంకి శంకుస్థాపన చేసి 2019కల్లా అన్ని పనులు పూర్తిచేసి తెలంగాణ రైతులకు నీరందించారు. కేసీఆర్‌ పనితనానికి, ఇతర ప్రభుత్వాల పనితనానికి తేడా వివరించడం కోసమే ఇది చెప్పాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు,” అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

కానీ కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్‌ క్రుంగిపోయింది. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల గోడలు పగుళ్ళు ఏర్పడ్డాయి. వాటిలో నీళ్ళు నింపితే మొతం బ్యారేజ్ కొట్టుకుపోయి దిగువన ఉండే 40-50 గ్రామాలు నీట మునుగుతాయని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి చెపుతున్నారు. పైగా ఈ ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతి జరిగిందని పీసీ ఘోష్ కమీషన్‌ నివేదిక ఇచ్చింది. కనుక సీబీఐ దర్యాప్తు జరపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి లేఖ వ్రాసింది.  

రేవంత్ రెడ్డి రాజకీయ కక్షతో లేదా కేసీఆర్‌ పేరుని తుడిచేయాలనే దురాలోచంతోనే కాళేశ్వరంని పాడుబెడుతున్నారని కేసీఆర్‌, హరీష్ రావు ఆరోపిస్తున్నారు. కానీ సీబీఐ విచారణ మొదలుపెడితే ఈ కోణంలో విమర్శలకు అర్ధం ఉండదు కదా?