ఇండియా కూటమితో సహా దేశంలో పలు పార్టీలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మళ్ళీ పూర్వంలాగే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈవీఎంలలో ఎటువంటి లోపం లేకపోయినా ఎన్నికలో ఓడిపోయిన పార్టీలు, నాయకులు ఈవీఎంల వల్లనే ఓడిపోయామని చెప్పడం పరిపాటిగా మారిపోయింది.
కనుక ఈ ఆరోపణలకు, ఈ సమస్యకు కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త పరిష్కారం కనుగొంది. ఇక నుంచి ఈవీఎంలలో కనిపించే బ్యాలెట్ పేపర్లపై అభ్యర్ధి పేరు, పార్టీ పేరు, ఎన్నికల చిహ్నంతో పాటు ఓటర్లకు స్పష్టంగా కనిపించే విధంగా అభ్యర్ధి కలర్ ఫోటో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈవీఎంలలో ఎన్నికల గుర్తులను, అభ్యర్ధుల పేర్లు చదవలేని నిరక్షరాస్యులు కూడా అభ్యర్ధుల కలర్ ఫోటో చూసి తమకు నచ్చిన అభ్యర్ధికి ఓట్లు వేయగలుగుతారు. త్వరలో జరుగబోయే బిహార్ ఎన్నికలలోనే ఈ కొత్త ప్రయోగం చేయబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.