మావోయిస్ట్ నేత జంపన్న లొంగిపోయారు

మావోయిస్ట్ అగ్రనేతలలో ఒకరైన జీనుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న, అయన భార్య రంజిత శనివారం హైదరాబాద్ లో పోలీసులకు లొంగిపోయారు. జంపన్న గత 35 ఏళ్లుగా మావోయిస్టులలో ఉన్నారు. వైకాపా నుంచి బయటకు వచ్చేటప్పటికి మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అయన తలపై రూ.20 లక్షల రివార్డు ఉంది. ఆయనను పట్టుకొనేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా పట్టుకోలేకపోయారు. చివరికి తనంతట తానుగా పోలీసులకు లొంగిపోయారు. అయన గత కొంతకాలంగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం. కనుక ఈ పరిస్థితులలో అడవులలో ఉంటూ సాయుధపోరాటాలు చేయలేనని భావించి పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

అయన స్వగ్రామం మహబూబాబాద్ జిల్లాలో తొర్రూర్ మండలంలో చర్లపాలెం. అయన తల్లి యశోదమ్మ ప్రస్తుతం భద్రాచలం సమీపంలో సారాపక గ్రామంలో తన కుమార్తె వద్ద ఉంటోంది. జంపన్న స్వయంగా పోలీసులకు లొంగిపోవడం మంచి విషయమే కానీ ఆరోగ్యం బాగున్నంతవరకు ప్రభుత్వంపై సాయుధపోరాటాలు చేస్తూ, శరీరంలో సత్తువ తగ్గగానే ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసినట్లు వచ్చి అంతకాలం ఏ పోలీసులను, ప్రభుత్వాన్ని శత్రువులుగా భావిస్తూ పోరాడేవారో వారికే లొంగిపోవడం చాలా విచిత్రంగానే ఉంది.