భాజపా జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహరావు బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా అయన రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాదారు.
“కెసిఆర్, చంద్రబాబు ఇద్దరూ ప్రధాని మోడీని చూసి చాలా భయపడుతున్నారు. అందుకే కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ పేరుతో తనలాగ మోడీని చూసి భయపడుతున్నవారినందరినీ పోగేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మోడీ ప్రభంజనం ముందు ఏ ఫ్రంటూ నిలబడలేదు. కెసిఆర్ బంగారి తెలంగాణా సాధిస్తామని చెప్పి తన కుటుంబాన్ని బంగారం చేసుకొన్నారు. ఆ కారణంగా తెలంగాణాలో తెరాసకు క్రమంగా బలం తగ్గుతోంది. అది గ్రహించే కెసిఆర్ ఈ సరికొత్త ధర్డ్ ఫ్రంట్ డ్రామా మొదలుపెట్టి, తన పార్టీ నేతల చేత ప్రధాని మోడీపై బురదజల్లిస్తున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే, మాకు ఈ ఒక్క ఏడాది చాలు త్రిపురలో విజయం సాధించినట్లే ఇక్కడా విజయం సాధించి అధికారం దక్కించుకోవడానికి. ఒకప్పుడు మా పార్టీ 5 రాష్ట్రాలలోనే అధికారంలో ఉండేది. ఇప్పుడు 21 రాష్ట్రాలలో ఉంది. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించడంపై దృష్టి పెట్టాము. వచ్చే ఎన్నికలలో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో మా సత్తా ఏమిటో చూపిస్తాము. ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచే కనీసం 40-50 ఎంపి సీట్లు సాధించడానికి తగిన వ్యూహాలు అమలుచేస్తాము.
కెసిఆర్ ధర్డ్ ఫ్రంట్ పేరుతో ప్రధాని మోడీపై బురదజల్లుతూ ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తూ కాలక్షేపం చేస్తోంది. ఇక హైదరాబాద్ లో మొదలైన సీపిఎం మహాసభలు ప్రధాని మోడీని తిట్టిపోయడానికే నిర్వహిస్తున్నట్లుంది. మోడీని తిట్టిపోయడం అన్ని పార్టీలకు ఒక దురలవాటుగా మారిపోయింది. అయితే అంతమాత్రన్న మోడీకున్న ప్రజాధారణ తగ్గిపోదు. మోడీ ప్రభంజనం ఆగదు. అది కర్ణాటకతో మొదలై దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ విస్తరించబోతోంది,” అని అన్నారు.