హైదరాబాద్ తరువాత ఆ స్థాయి కలిగిన నగరం వరంగల్. ఐటి, పారిశ్రామిక రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కనుక వరంగల్ ను మరింత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్ లో రూ.900 కోట్లు కేటాయించింది. చేతిలో సరిపడినన్ని నిధులు సిద్దంగా ఉనందున వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
వాటిలో అవుటర్, ఇన్నర్ రింగ్ రోడ్స్ నిర్మాణం, ధీమ్ పార్క్, అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్టేడియం, పిల్లలు ఆడుకొనేందుకు పార్కులు, చారిత్రిక ప్రాధాన్యతను తెలియజేసే హెరిటేజ్ సెంటర్లు, నగరంలో పచ్చదనంపెంచడం, మౌలికసౌకర్యాలవంటివి ఉన్నాయి.
హన్మకొండలోని ‘కుడా’ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, పోలీసు కమిషనర్ డాక్టర్ వి.రవీందర్, కార్పొరేషన్ కమిషనర్ వీపీగౌతమ్, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ విభాగం డైరెక్టరు విద్యాదర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్, మేయర్ నరేందర్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, డాక్టర్ రాజయ్య, కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆమోదించిన పనులు, ప్రాజెక్టుల గురించి కడియం శ్రీహరి విలేఖరులకు వివరించారు. ఈనెల 20వ తేదీన మాస్టర్ ప్లాన్ ముసాయిదాను విడుదల చేస్తామని చెప్పారు.
1. వరంగల్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మించి, దాని చుట్టూ మళ్ళీ శాటిలైట్ టౌన్ షిప్ నిర్మించబడుతుంది. దీనికోసం 500-1000 ఎకరాలు సేకరించబడుతుంది.
2. దేవునూరులో 200 ఎకరాలలో ఒక ధీమ్ పార్క్ ఏర్పాటు చేసి, ఆ ప్రాంతంలోనే ఉన్న ఇనుపరాతి గుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయబడుతుంది.
3. ధర్మాసాగర్ చెరువులో వాటర్ స్పోర్ట్స్ మరియు రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటు.
4. ధర్మాసాగర్ మండలం ఎలకుర్తి గ్రామంలో గల 220 ఎకరాల ప్రభుత్వం భూమిలో 50 ఎకరాలలో సైనిక్ స్కూల్, 50 ఎకరాలలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయబడతాయి. మిగిలిన ప్రాంతంలో అంతర్జాతీయస్థాయిలో స్టేడియం, విద్యాసంస్థల జోన్ ఏర్పాటు.
5. వరంగల్, హన్మకొండ ఆరు ప్రధానరహదారులను మోడల్ రోడ్లుగా అభివృద్ధి చేయబడతాయి. అలాగే నగరంలో ప్రధానమైన 10 జంక్షన్లను కూడా అభివృద్ధి చేస్తారు.
6. ఖాజీపేటలో నిట్ నుంచి వడ్డేపల్లి, కేయుసి వరకు, అలాగే ఎస్డిఎల్సీఈ జంక్షన్, పెద్దమ్మగడ్డ మీదుగా ములుగురోడ్డు వరకు అన్ని రోడ్లను అభివృద్ధి చేస్తారు. పెద్దపెండ్యాల నుంచి మడికొండ, ఖాజీపేట, హన్మకొండ చౌరస్తా, ములుగు రోడ్, ఎంజిఎం హాస్పిటల్ జంక్షన్, పోచమ్మ మైదానం లేబర్ కాలనీ మీదుగా ధర్మారం వరకు అన్ని రోడ్లు అభివృద్ధి చేయబడతాయి. అలాగే సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి, ఆ రోడ్లపక్కన చెట్లు పెంచబడతాయి.
7. భద్రకాళి, హన్మకొండ, వడ్డేపల్లి, దేశాయిపేట, చిన్న వడ్డేపల్లి, ఉర్సు రంగసముద్రం ప్రాంతాలలో గల చెరువులు, కుంటల అభివృద్ధి, సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టబడతాయి.