తిరుమలేశుని చేరుకోవడానికి మరో మార్గం!

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. కొండపైకి చేరుకోవడానికి మెట్లదారి కాకుండా ఒకటే మార్గం ఉంది. రెండో మార్గంలో కొండక్రిందకు వెళ్ళే వాహనాలు ప్రయాణిస్తుంటాయి. వర్షాకాలం వస్తే కొండపైకి వెళ్ళేదారిలో పైనుంచి బండరాళ్ళు దొర్లిపడుతుంటాయి. కనుక మరొక ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావించి ఎల్&టి సంస్థను సంప్రదించగా, వారు సర్వే చేసి మోకాళ్ళ మిట్ట నుంచి మూడు కిమీ పొడవున ఒక లింక్ రోడ్డు నిర్మించినట్లయితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలియజేసింది. అక్కడ రోడ్డు నిర్మించి, కాలినడకన వెళ్ళే భక్తులకోసం అవసరమైతే ఒక సొరంగ మార్గం నిర్మించవచ్చని సూచించింది. ఎల్&టి సంస్థ చేసిన ఈ ప్రతిపాదనలపై తితిదే బోర్డు సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు. లింక్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి డిజైన్, అంచనాలను సమర్పించవలసిందిగా కోరింది. ఈ లింక్ రోడ్డు నిర్మాణం పూర్తయ్యి అందుబాటులోకి వస్తే తిరుమల వచ్చే భక్తులకు చాలా సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటుందని తితిదే అధికారులు భావిస్తున్నారు.