రైతుబందు చెక్కుల పంపిణీలో ఆలస్యం?

తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబందు పధకం క్రింద రాష్ట్రంలో రైతులందరికీ ఏప్రిల్ 19వ తేదీ నుంచి చెక్కులు పంపిణీ చేస్తామని మంత్రులు ప్రకటించారు. కానీ మే 10వ తేదీ నుంచి చెక్కుల పంపిణీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. చెక్కులతో పాటు రైతుల పాస్ పుస్తకాలను కూడా అదేరోజు నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతుబందు చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  

చెక్కుల పంపిణీ ఆలస్యం కావడానికి నగదు కొరత కారణమని తెలుస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకొన్నప్పటికీ, దేశవ్యాప్తంగా మళ్ళీ నగదు కొరత ఏర్పడటంతో చెక్కుల పంపిణీ ఆలస్యం అవుతోంది. ప్రభుత్వం చెక్కులు జారీచేసిన వెంటనే రైతులు వాటిని బ్యాంకులలో జమా చేయడం ఖాయం. కానీ నగదు కొరత కారణంగా రైతులకు డబ్బు అందకపోతే వారి ఆగ్రహం చవి చూడవలసి వస్తుంది. అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది. బహుశః అందుకే చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కొన్నిరోజులు వాయిదావేసి ఉండవచ్చు. కేంద్రం వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం నిందలుభరించడంకంటే ఇదే నయం కదా?