జైట్లీజీ...ఏమి మాట్లాడుతున్నారు?

దేశంలో నగదు కొరత సమస్య తాత్కాలికమేనని ఒకటి రెండు రోజులలోనే దానిని పరిష్కరిస్తామని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ట్వీట్ పై రెండు తెలుగు రాష్ట్రాల ఐటి మంత్రులు కేటిఆర్, లోకేష్ తమదైన శైలిలో స్పందించారు.

మంత్రి కేటిఆర్ స్పందిస్తూ, “ఇది తాత్కాలిక సమస్య కాదు. బ్యాంకులు, ఏటిఎంలలో అకస్మాత్తుగా నగదు కొరత ఏర్పడలేదు. గత మూడు నెలలుగా ఈ సమస్య ఉంది. దీనిపై నిత్యం పిర్యాదులు వస్తూనే ఉన్నాయి. దయచేసి ఆర్ధికశాఖ, రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఈ సమస్యపై లోతుగా చర్చించండి. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని పోగొట్టవద్దు,” అని చాలా సున్నితంగా చెప్పవలసింది చెప్పారు. 

నారా లోకేష్ స్పందిస్తూ, “అరుణ్ జైట్లీ వాస్తవ పరిస్థితుల గురించి తెలుసుకోకుండా అంతా బాగుందని చెప్పడం చాలా బాధాకరం. ఏపిలో నగదుకొరత చాలా తీవ్రంగా ఉందని, తక్షణమే నగదు పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఎన్ని లేఖలు వ్రాసిన ఫలితం లేదు. నగదు కొరతతో రాష్ట్రప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక పెన్షన్లు, ఉపాధి హామీల వేతనాల చెల్లింపులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా కేంద్రం కళ్ళు తెరిచి ఈ సమస్యను పరిష్కరించాలి,” అని కోరారు. 

ఇంకా మిగిలిన రాష్ట్రాలు ఏమని మోరపెట్టుకొంటున్నాయో? ఈ సమస్య ఇంకా ఎప్పటికి తీరుతుందో? అసలు తీరుతుందో లేక శాశ్విత సమస్యగా మారిపోతుందో? ఏమో!