డోంట్ వర్రీ...ఐయాం హియర్!

ఒకప్పుడు నోట్లరద్దు నిర్ణయం ‘సర్వరోగనివారిణి’ అన్నట్లు మాట్లాడిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ నేడు దాని వలన ఎదురవుతున్న సమస్యల గురించి మాట్లాడుతుండటం విశేషం. నోట్లరద్దుతో ఎవరికి ఏమి ప్రయోజనం కలిగిందో తెలియదు కానీ ఆ తరువాత నుంచి దేశప్రజలలో వారువీరు..చిన్నాపెద్దా.. అనే తేడా లేకుండా అందరూ అష్టకష్టాలు పడ్డారు. 

ఆ తరువాత నగదు రహితలావాదేవీలు అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నానా ఇబ్బందులు పెట్టాయి.అదే సర్వరోగ నివారిణి అన్నట్లు ఊదరగొట్టాయి. నోట్లరద్దుకు ముందు కానీ, నగదు రహిత లావాదేవీలు అమలుచేయించే ముందుగానీ ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లు దేశప్రజలపై బలవంతంగా తమ నిర్ణయాలను రుద్దారు. ఆ తరువాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చల్లబడిపోయాయి. మళ్ళీ సాఫీగా నగదు చలామణి సాగుతుంటే, మెల్లమెల్లగా నగదు కనబడకుండా మాయం కాసాగింది. తరచూ అలాగ ఎందుకు జరుగుతోందో..దానికి కారణాలు ఏమిటో.. రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేస్తున్న లక్షల కోట్ల నగదు అంతా ఎక్కడికి మాయం అయిపోతోందో...తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, నగదు కొరత ఏర్పడినప్పుడల్లా బారీగా నోట్లు ముద్రించి ప్రజలకు అందజేసి చేతులు దులుపుకొంటోంది కేంద్రప్రభుత్వం. ఇటువంటి లోపభూయిష్టమైన ఆర్ధికవిధానాల వలననే కొన్ని దేశాలలో కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఒక బ్రెడ్ కొనుక్కోవాలంటే బస్తాతో నోట్లు తీసుకొని వెళ్ళవలసిన పరిస్థితులు దాపురించాయి. ప్రస్తుతం మన దేశంలో కూడా ఇదేవిధంగా సాగితే అప్పుడు మనకూ అటువంటి పరిస్థితే దాపురించవచ్చు. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మళ్ళీ నగదు కొరత ఏర్పడటంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈవిషయం ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి తెలియడం మన అదృష్టంగా భావించలేమో! ఈ సమస్యపై అయన స్పందిస్తూ “ఇది తాత్కాలిక సమస్యే. దీనిని పరిష్కరించడానికి అన్ని చర్యలు చేపడుతున్నాము. ఒకటి రెండు రోజులలోనే అంతా సర్దుకొంటుంది,” అని ట్వీట్ చేశారు.