కోమటిరెడ్డి కేసులో ఊహించని మలుపు!

కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వరద్దు కేసు ఈరోజు ఊహించని మలుపుతిరిగింది. వారి పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరిస్తూ, వారిరువురి సభ్యత్వాలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. వారిరువురూ పూర్తికాలం ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చని స్పష్టం చేసింది. అయితే శాసనమండలి చైర్మన్ పై వారు దాడిచేసి, గాయపరిచినట్లయితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చునని స్పష్టం చేసింది. 

తమ సభ్యత్వాలను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ వారిరువురూ హైకోర్టులో పిటిషన్లు వేసినప్పుడు, ప్రభుత్వం వారు దోషులని నిరూపించగల సాక్ష్యాలను కోర్టుకు సమర్పించలేకపోయింది. ఆ దాడికి సంబంధించిన వీడియో ఫుటేజిని సమర్పించవలసిందిగా హైకోర్టు రెండుమూడుసార్లు గట్టిగా చెప్పింది. ఒకవేళ సమర్పించకపోతే ఈ వ్యవహారంలో ఇక ప్రభుత్వం చెప్పదలచుకొన్నది ఏమీ లేదని భావించి తీర్పు వెలువరిస్తామని హైకోర్టు ముందుగానే హెచ్చరించింది. చెప్పినట్లుగానే వారిద్దరి శాసనసభ్యత్వాలను పునరుద్దరించింది. 

ఇది తెరాస సర్కార్ కు చాలా అవమానకరమేనని చెప్పక తప్పదు. వారి విషయంలో తెరాస సర్కార్ చాలా తొందరపాటు ప్రదర్శించిందని చెప్పకతప్పదు. వారిరువురి సభ్యత్వాలు రద్దు చేయడమే కాకుండా ఆ విషయాన్నీ తెలియజేస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ కూడా వ్రాసింది. కానీ వారు దోషులని నిరూపించలేక తడబడి చివరికి ఈవిధంగా భంగపడింది. 

ఈ కేసులో ఆ ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులకంటే ప్రభుత్వానికే ఎక్కువ నష్టం జరిగింది. ఈకేసు కారణంగానే రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రకాస్ రెడ్డి రాజీనామా చేయవలసి వచ్చింది. వ్రతం చెడినా ఫలం దక్కనట్లు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాలు పునరుద్దరించబడ్డాయి. దీనిపై తెరాస నేతలు ఏవిధంగా స్పందిస్తారో తెలియదు కానీ కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ తెరాస నేతలపై చెలరేగిపోవచ్చు.