అవును..బాసర ఆలయంలో అక్రమాలు నిజమే!

దేశంలో సరస్వతీ ఆలయాలను వేళ్ళ మీద లెక్కించవచ్చు. వాటిలో బాసర జ్ఞానసరస్వతీదేవి ఆలయం కూడా ఒకటి. ఆ ఆలయం తెలంగాణా రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపునిస్తోంది. అటువంటి ప్రసిద్దమైన ఆలయంలో అధికారులు, ఉద్యోగులు, పూజారుల చేతివాటం చూపిస్తుండటం చాలా విచారకరం. ఆలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల గురించి అప్పుడప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మద్యన ఒక ఆలయపూజారి ఆలయంలో ఉత్సవ విగ్రహాన్ని వేరే ఊరికి తీసుకువెళ్ళి అక్షరాభ్యాసాలు చేయించడం, తదనంతర జరిగిన పరిణామాలు బహుశః అందరికీ గుర్తుండే ఉంటాయి. అయితే అది కేవలం ‘శాంపిల్’ మాత్రమేనని బాసర ఆలయంలో అంతకంటే బారీ అక్రమాలు జరుగుతున్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. 

ఆలయంలో అందరూ కలిసి సుమారు వందకోట్లు కైంకర్యం చేసేశారని ప్రభుత్వం నియమించిన కమిటీయే తేల్చి చెప్పింది. బాసర ఆలయంలో జరుగుతున్న అక్రమాల గురించి తరచూ మీడియాలో వార్తలు వస్తుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం బాసర ఆలయంలో 2014-17సం.ల మద్య జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ జాయింట్ కమీషనర్ కృష్ణవేణి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించింది. వారు సుమారు నెలరోజులపాటు బాసర ఆలయానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనని దృవీకరించారు. 

ఆలయంలో ప్రసాదం తయారీ మొదలు అక్షరాభ్యాసాలు, టికెట్లు విక్రయాల వరకు పైనుంచి క్రింది స్థాయివరకు అందరూ కుమ్మకయ్యి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. వారికి కొందరు రాజకీయ నేతల అండదండలున్నారనే విషయం కూడా ఆ నివేదికలో పేర్కొనట్లు సమాచారం. బాసర ఆలయంలో సమూలంగా ప్రక్షాళన చేయడం చాలా అవసరమని నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. అమ్మవారి ఆలయానికే కన్నం వేస్తున్న ఇంటిదొంగలందరిపై చట్టప్రకారం చర్యలు చేపట్టి, వారందరూ దోచుకొన్న అమ్మవారి సంపదను రికవరీ చేయాలని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో మళ్ళీ ఇటువంటి అవినీతి, అక్రమాలు పునరావృతం కాకుండా నివారించి ఆలయ ప్రతిష్ట పెరిగేందుకు చేపట్టవలసిన చర్యలను కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు.