తెలంగాణా రాష్ట్రంలో వైకాపా అనే ఒక రాజకీయ పార్టీ కూడా ఒకటుందని జనాలు మరిచిపోయినవేళ ‘మేము కూడా ఉన్నాం..’ అని గుర్తుచేస్తుంటారు ఆ పార్టీ రాష్ట్ర నేతలు. బహుశః ఆ ప్రయత్నంలో టి-వైకాపా కూడా బస్సు యాత్ర చేపట్టబోతోంది.
మేడ్చల్ జిల్లా షామీర్ పెట్ మండలంలో సోమవారం టి-వైకాపా నేతలు సమావేశమయ్యారు. తెరాస అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ నుంచి కరీంనగర్ వరకు 10 రోజులపాటు బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. దీనికి ‘వైఎస్ఆర్ జనచైతన్యయాత్ర’ అని పేరు పెట్టినట్లు చెప్పారు. సమైక్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పధకాలను కొనసాగించడంలో తెరాస సర్కార్ వైఫల్యం చెందిందని, వాటిని మళ్ళీ కొనసాగించాలని కోరుతామని చెప్పారు. సమాజంలో నిరుపేదలు, బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టో రూపొందిస్తున్నామని చెప్పారు. బస్సు యాత్రకు, మ్యానిఫెస్టో రూపకల్పనకు వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.