హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు చెందిన వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో పనిచేస్తున్న వాచ్ మ్యాన్లు, స్వీపర్లు, ఆఫీస్ సబార్దినేట్లు, కామాటి, చాకలి, మంగలి, వంటమనుషులు, మరుగుదొడ్లు శుభ్రపరిచేవారు...వారి సహాయకుల జీతాలు పెంచుతూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో చాలా మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే కావడంతో ఇంతవరకు వారికి ఆ శాఖ నెలకు రూ.6,500 మాత్రమే చెల్లించేది. వారి జీతాలు పెంచాలంటూ గత ఏడాది హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దానిపై హైకోర్టు తీర్పు వెలువరిస్తూ వారికి కనీసం రూ.13,000 గరిష్టంగా రూ.42,270 జీతం చెల్లించాలని ఆదేశించింది. సమానపనికి సమానజీతం ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నెలకు కనీస వేతనం రూ.13,000 చొప్పున చెల్లించాలని స్త్రీ, శిశుసంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.