తెరాస సర్కార్ పై దావా వేస్తా: కోమటిరెడ్డి

సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సూర్యాపేట పట్టణం సమీపంలో చేపట్టకుండా 10 కిమీ దూరంలో నిర్మించడాన్ని సవాలు చేస్తూ ఈనెల 16న హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేఖరులకు చెప్పారు. 

సూర్యాపేట పట్టణం సమీపంలో ప్రభుత్వ అసైన్డ్ భూములున్నప్పటికీ మంత్రి జగదీశ్ రెడ్డి ఒత్తిడి మేరకు పట్టణానికి దూరంగా నిర్మిస్తున్నారని, దాని వలన మంత్రి బినామీగా ఉన్న శ్రీసాయి డెవలపర్స్ కు ఆర్ధికలబ్ది పొందుతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఇది రూ.200-300 కోట్ల కుంభకోణమని, దీని వెనుక మంత్రి జగదీశ్ రెడ్డి హస్తం ఉందని కోమటిరెడ్డి ఆరోపించారు. పట్టణానికి సమీపంలో గల ప్రభుత్వ స్థలంలో ఎస్పి కార్యాలయం నిర్మిస్తున్నప్పుడు అక్కడే కలెక్టర్ కార్యాలయం నిర్మించడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంపై మీడియాలో వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ, కనీసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి కెసిఆర్ దీనిపై స్పందించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేకుంటే సూర్యాపేట ప్రజలతో కలిసి ధర్నా చేస్తానని హెచ్చరించారు. దీనిపై ఈనెల 16న హైకోర్టులో పిటిషన్ వేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడుతున్న మంత్రి జగదీశ్ రెడ్డిపై ముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణం చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.