మళ్ళీ చాలా రోజుల తరువాత ఆర్.బి.ఐ. మాజీ గవర్నర్ రఘురామ రాజన్ వార్తలలోకి వచ్చారు. కేంబ్రిడ్జి హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ లో ప్రసంగిస్తూ, నోట్లరద్దు, జి.ఎస్.టిలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
నోట్లరద్దు నిర్ణయం సరికాదని, దానిని అమలుచేసేముందు కనీసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా అమలుచేయడం ఘోరతప్పిదమని అన్నారు. దేశంలో చలామణిలో ఉన్న 87 శాతం నగదును ఉపసంహరించుకొంటున్నప్పుడు, అంత కరెన్సీ ముందుగా ప్రింట్ చేసి సిద్దం చేసుకొన్నాకనే నోట్లరద్దు ప్రకటించి ఉండిఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదన్నారు. మోడీ సర్కార్ తీసుకొన్న ఆ నిర్ణయం వలన దేశంలో అసంఘటిత రంగం దారుణంగా దెబ్బతిందని, అనేకమంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని రఘురామ రాజన్ అన్నారు. అదీగాక దేశప్రగతికి అది బ్రేకులు వేసిందని, దేశ ఆర్ధిక పరిస్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని అన్నారు. ఇంత నష్టం జరిగినా, నోట్లరద్దు వలన ప్రభుత్వం అనుకొన్న ఫలితం రాలేదని అన్నారు. నోట్లరద్దు నిర్ణయం గురించి ప్రభుత్వం తనకు తెలియజేసినప్పుడు దానిని తాను వ్యతిరేకించానని, దాని వలన మంచి కంటే చెడే ఎక్కువ జరుగవచ్చని ప్రభుత్వానికి సూచించానని చెప్పారు.
ఇక జి.ఎస్.టి. ఒక మంచి ఆలోచన అని కానీ దానిని కూడా అమలుచేసే ముందు మరింత విస్తృతమైన కసరత్తు చేసి, అన్ని ఏర్పాట్లు చేసి అమలుచేసి ఉండి ఉంటే బాగుండేదని రాజన్ అన్నారు. అయితే దాని వలన దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాని రాజన్ చెప్పారు.