నిజామాబాద్ పట్టణంలో మూడు రోజుల పాటు యోగాభ్యాస శిక్షణా కార్యక్రమాలు ముగించిన తరువాత యోగాగురు బాబా రాందేవ్ గురువారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసారు. వారిరువురూ రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి చర్చించుకొన్నట్లు సమాచారం. అనంతరం బాబా రాందేవ్ మీడియాతో మాట్లాడుతూ, “వ్యవసాయరంగంపై ఇంత అవగాహన, మక్కువ కలిగిన ముఖ్యమంత్రిని నేనెప్పుడూ చూడలేదు. రైతుల కోసం సిఎం కెసిఆర్ చేపట్టిన పనులను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. మన దేశం ప్రధానంగా వ్యవాసాయ ఆధారిత దేశం. కనుక రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి బలోపేతం చేయడానికి సిఎం కెసిఆర్...అయన ప్రభుత్వమూ చేస్తున్న కృషి చాలా అభినందనీయం. అలాగే తెలంగాణా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. ప్రభుత్వం వాటిని చాలా చిత్తశుద్ధితో అమలుచేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణా ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి నేను కూడా సహాయసహకారాలు అందిస్తాను,” అని అన్నారు.
ఆ తరువాత బాబా రాందేవ్ ట్విట్టర్ ద్వారా కూడా కెసిఆర్ కు అభినందనలు తెలియజేస్తూ, “తెలంగాణాలో రైతు సంక్షేమం, సామాజిక న్యాయం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థల గురించి సిఎం కెసిఆర్ కు స్పష్టమైన ఆలోచన, ముందుచూపు ఉంది,” అని ఒక మెసేజ్ పెట్టారు.