ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ ఉత్తరభారతంలో జరిగిన బంద్ హింసాత్మకంగా మారి అనేకమంది చనిపోయారు. దాంతో కేంద్రం దిగివచ్చి సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్ వేయగా దానిని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించవలసి వచ్చింది.
ఈ పరిణామాలపై దేశంలో అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. దానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. 1. ఇది దళితులకు సంబంధించిన విషయం. 2. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటం.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి వేముల రోహిత్ దళిత విద్యార్ధి కనుకనే దేశం నలుమూలల నుంచి రాజకీయ నాయకులు వచ్చి అక్కడ వాలిపోయి హడావుడి చేసిన సంగతి గుర్తు తెచ్చుకొంటే, మొదటి కారణం సహేతుకమని అర్ధమవుతుంది. మన రాజకీయ పార్టీలు దళితులను మనుషులుగా కాక ఓటర్లుగానే చూస్తుంటాయి కనుకనే ఆ రోజు అంత హడావుడి చేశాయి. ఇప్పుడూ అందుకే హడావుడి చేస్తున్నాయని చెప్పక తప్పదు.
ఆ ఘటనపై తెరాస తరపున మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. అయన తెలంగాణా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో ఏటా 40,000కు పైగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అవుతున్నాయి. వాటిలో అత్యధికం బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలోనే అవుతున్నాయి. వాటిలో ఒక్క బిహార్ తప్ప మిగిలిన నాలుగు భాజపా పాలిత రాష్ట్రాలే. కనుక దేశంలో దళితుల భద్రతకు భరోసా కల్పించవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. అయితే దళితులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను అర్ధం చేసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్, భాజపాలు ఆ అంశంతో ఆధిపత్యపోరుకు తలపడటం సిగ్గుచేటు. దళితులకు ఆ రెండు పార్టీలు ఏమి చేసాయో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొంటే బాగుంటుంది,” అని అన్నారు.
మంత్రి హరీష్ రావు చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజమే. దక్షిణాది రాష్ట్రాల కంటే ఉత్తరాది రాష్ట్రాలలోనే దళితులపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. అంత మాత్రాన్న తెలంగాణాలో జరగడంలేదని చెప్పలేము. ఈ నాలుగేళ్ళలో రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగాయి. వాటిపై ప్రభుత్వ స్పందన అంత సంతృప్తికరంగా లేదనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కనుక కేంద్రాన్ని తెరాస నేతలు వేలెత్తి చూపే ముందు ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిది కదా!