దేశానికి పట్టిన శని కాంగ్రెస్: కేటిఆర్

అటు కాంగ్రెస్ నేతలు బస్సు యాత్రలు చేస్తూ తెరాస సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తుంటే, ఇటు తెరాస మంత్రులు కూడా వారిని ఎండగడుతున్నారు. 

మంత్రి కేటిఆర్ మంగళవారం మణుగూరులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, “ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీయే. అది తెలంగాణా ప్రసాదించిందని చెప్పుకోవడం సిగ్గుచేటు. తెలంగాణా ప్రజలందరూ చేసిన పోరాటాల వలననే తప్పనిసరి పరిస్థితులలో తెలంగాణా ఇవ్వవలసి వచ్చింది తప్ప అదేమీ అడగగానే ఇవ్వలేదు. పదేళ్ళపాటు కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రాన్ని పాలించినప్పుడు, ఇప్పుడున్న కాంగ్రెస్ నేతలే మంత్రులుగా ఉన్నారు. కానీ వారు తెలంగాణాకు చేసిందేమీ లేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఈసడించుకొంటున్నా అందరూ పదవులకోసం మౌనం వహించారు. తెలంగాణా ఏర్పడితే రాష్ట్రం చీకటయిపోతుందని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని కిరణ్ కుమార్ రెడ్డి భయపెట్టారు. కానీ రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలోపే నిరంతర విద్యుత్ సరఫరా అవుతోంది. పల్లె పల్లెలో వెలుగులు నిండాయి. దేశంలో మరే ముఖ్యమంత్రి చేయలేని సాహసం కెసిఆర్ చేశారు. ఇంటింటికీ త్రాగునీళ్ళు అందించలేకపోతే వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగబోమని చెప్పారు. రాష్ట్రమంతటా నీళ్ళు పారించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని రేయింబవళ్ళు కృషి చేస్తున్నాము. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశానికి, తెలంగాణాకు ఏమి చేసింది? అని ప్రశ్నించారు.