ఇటీవలే భాజపాకు గుడ్ బై చెప్పేసిన నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎదురుచూస్తున్నారు. అయన రాకను డికె అరుణ, దామోదర్ రెడ్డి తదితరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘నాగం పార్టీలో చేరినా సహిస్తాము కానీ నాగర్ కర్నూల్ టికెట్ ఆశిస్తే మాత్రం సహించబోమని’ వారు ఇప్పుడే గట్టిగా హెచ్చరిస్తున్నారు. వారిని నాగం జనార్ధన్ రెడ్డి సెంటిమెంటుతో తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తనకు 2019 ఎన్నికలే చివరి ఎన్నికలని ఆ తరువాత ఇక పోటీచేయనని చెపుతున్నారు. రాబోయే ఎన్నికలలో తెరాసను ఓడించి ప్రతీకారం తీర్చుకోవడం కోసమే పోటీ చేయాలనుకొంటున్నానని చెపుతున్నారు.
అయితే ఇటువంటి సెంటిమెంట్లను వినదలిస్తే ప్రతీ ఒక్కరికీ ఏదో ఒకటి ఉంటుంది కనుక నాగం సెంటిమెంటును డికె అరుణ వర్గం పట్టించుకోకపోవచ్చు. ఒకవేళ వారిని కాదని నాగంకు టికెట్ ఇస్తే, జిల్లా కాంగ్రెస్ లో ముసలం పుట్టడం ఖాయం. కానీ టికెట్ హామీ లభిస్తేనే నాగం కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొంటున్నారు కనుక నాగం ఎంట్రీపై డిల్లీ పెద్దలు ఏమి నిర్ణయం తీసుకొంటారో చూడాలి.