తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇష్టపడితే ఆయనకు మక్తల్ సీటును కేటాయిస్తామని వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి అన్నారు. నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దపడుతుంటే అయన చేరికను డికె అరుణ, దామోదర్ రెడ్డి తదితరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయన కాంగ్రెస్ పార్టీలో చేరినా పరవాలేదు కానీ నాగర్ కర్నూల్ టికెట్ ఆశిస్తే మాత్రం ఒప్పుకోమని గట్టిగా చెపుతున్నారు. ఇప్పుడు రావులను కూడా పార్టీలోకి ఆహ్వానించి మక్తల్ టికెట్ ఇస్తామని చిన్నారెడ్డి భరోసా ఇస్తున్నారు.
కానీ తాను వచ్చే ఎన్నికలలో తెదేపా తరపున వనపర్తి నుంచే పోటీ చేస్తానని రావుల చెపుతున్నారు. ఆయనకు జిల్లాలో మంచి బలం ఉంది కనుక పోటీ చేసి గెలవవచ్చు కానీ రాష్ట్రంలో తెదేపా ఉనికి కోల్పోయినప్పుడు ఆ పార్టీ తరపున పోటీ చేస్తే కాంగ్రెస్, తెరాసల ధాటిని తట్టుకొని నిలబడగలగాలి. నిలబడటమే కాదు..ఎన్నికలలో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా దాని వలన ఆయనకు ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. కనుక అప్పుడు అధికారంలోకి వచ్చే తెరాసలోనో లేదా కాంగ్రెస్ పార్టీలోనో చేరవలసి వస్తుంది. కనుక అదేదో ఇప్పుడే కాంగ్రెస్ లో చేరితే ఎన్నికలలో దాని మద్దతు లభిస్తుంది. ఒకవేళ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హవా వీచినట్లయితే అవలీలగా విజయం సాధించవచ్చునని అయన సన్నిహితులు చెపుతున్నట్లు సమాచారం. బంతి ఇప్పుడు రావుల కోర్టులోనే ఉంది కనుక పార్టీ మారే విషయంలో అయన త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చు.