ఎడ్యూరప్ప అవినీతిపరుడు: అమిత్ షా!!!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప అవినీతి ఆరోపణలలో జైలుకు వెళ్ళివచ్చిన వ్యక్తి. అయన అవినీతి కారణంగానే రెండు దశాబ్దాల పాటు ఏకధాటిగా ఏలిన కర్ణాటక రాష్ట్రాన్ని గత ఎన్నికలలో చేజార్చుకోవలసి వచ్చింది. ఆ కోపంతోనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. కానీ కర్ణాటకలో తమ పార్టీని ముంచినా తేల్చినా ఆయనకు మాత్రమే సాధ్యం అని గ్రహించి మళ్ళీ ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించింది. నేనే ముఖ్యమంత్రి అభ్యర్ధినని ఆయనే స్వయంగా కొంతకాలం క్రితం ప్రకటించుకొన్నారు. పార్టీపై ఆయనకున్న పట్టుకు అదే ఒక చక్కటి నిదర్శనమని చెప్పవచ్చు. కనుక మే 12న జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాజపాను గెలిపించుకొనే బాధ్యత ఎడ్యూరప్పపైనే ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు.

అయితే, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న భాజపా అధ్యక్షుడు అమిత్ షా పొరపాటున ఎడ్యూరప్ప గురించి ఒక చేదు నిజం చెప్పేశారు. వేదికపై ఎడ్యూరప్ప పక్కను కూర్చొని ఉండగానే, “ఈమధ్యనే నేను ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అవినీతి గురించి మాట్లాడుతూ, ఇంతవరకు తాను చూసిన ప్రభుత్వాలన్నిటిలోకి ఎడ్యూరప్ప ప్రభుత్వమే అత్యంత అవినీతిదని అన్నారు,” అని అమిత్ షా అన్నారు. 

అదివిని పక్కనే కూర్చొన్న ఎడ్యూరప్పతో సహా అందరూ ఉలిక్కిపడ్డారు. పక్కనున్న ఓ నేత ‘ఎడ్యూరప్ప కాదు...సిద్దరామయ్య’ అని అమిత్ షా చెవిలో చెప్పగానే ఆయన నాలిక కరుచుకొని ‘సిద్దరామయ్య ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వం’ అని సర్ది చెప్పారు. 

కానీ సాక్షాత్ పార్టీ జాతీయ అధ్యక్షుడి నోట తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి గురించి ఈవిధంగా చెప్పితే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు కదా? అందుకే “కనీసం ఇప్పటికైనా అమిత్ షా నిజం చెప్పారు. ఎడ్యూరప్ప అవినీతిపరుడని అందరికీ తెలిసిన విషయాన్ని ఆయన కూడా ఒప్పుకొని సభాముఖంగా చాటిచెప్పినందుకు కృతజ్ఞతలు,” అని కాంగ్రెస్ నేతలు ట్వీట్లు సందిస్తున్నారు. ఎడ్యూరప్ప గురించి అమిత్ షా చెప్పిన మాటలను, వీడియోను కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇక భాజపా చేయగలిగిందేమీ లేదు కనుక దీనిపై నుంచి అందరి దృష్టి మళ్ళించే ప్రయత్నం చేయకతప్పదు.