ఏపికి సహకరిస్తామంటే మాపైనే విమర్శలా? కవిత

తెరాస ఎంపి కవిత ఏపి పార్టీల నేతలను, కేంద్రం తీరును తప్పు పడుతూ తీవ్రంగా ఆక్షేపించారు. సోమవారం తెలంగాణా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేకహోదాతో సహా విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలు అమలుచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని మేము కేంద్రాన్ని కోరుతున్నాము. రెండు తెలుగు రాష్ట్రాలు సరిసమానంగా అభివృద్ధి సాధించాలనే మేము ఎప్పుడూ కోరుకొంటున్నాము. మేము ఏపికి సహకరించడానికి ముందుకు వస్తుంటే, ఏపిలో రాజకీయ పార్టీల నేతలు ‘రాష్ట్ర విభజన చేయడం చాలా అన్యాయం...కేంద్రంతో తెరాస కుమక్కు అయ్యింది’ అంటూ చాలా అనుచితంగా మాట్లాడుతుండటం మాకు చాలా బాధ కలిగిస్తోంది. మేము నేటికీ ఎన్డీయేకు దూరంగానే ఉన్నాము. నిజానికి ప్రత్యేకహోదా సాధించుకొనే విషయంలో వారికే స్పష్టత లేదు. అందరూ కలిసికట్టుగా పోరాడి ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. కానీ వారిలో వారికే ఐక్యత లేదు. కనుక ఇప్పటికైనా ఏపి నేతలు తమ వైఖరి మార్చుకొంటే వారితో కలిసి ఏపికి రావలసినవాటి కోసం పోరాడటానికి మేము సిద్దంగా ఉన్నాము,” అని అన్నారు. 

“కేంద్రం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే దున్నపోతుపై వాన పడుతున్నట్లుంది. కేంద్రప్రభుత్వంలో ఉండవలసిన సున్నితత్వం లోపించింది. వివిధ రాష్ట్రాల ఎంపిలు పార్లమెంటులో ప్రస్తావిస్తున్న అంశాలపై కేంద్రం స్పందించడమేలేదు,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నేతృత్వంలో భాజపా వ్యతిరేక పార్టీలను కూడగట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలు, కెసిఆర్ ఏర్పాటు చేయాలనుకొన్న ధర్డ్ ఫ్రంట్ కు అవరోధం కాబోవని ఆమె అభిప్రాయపడ్డారు. తమతో కలిసి వచ్చే పార్టీలతోనే ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని కవిత చెప్పారు.