పంటపెట్టుబడి సకాలంలో అందేనా?

రాష్ట్రంలో స్వంతభూమి ఉండి వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఎకరాకు రూ.4,000 చొప్పున పంటపెట్టుబడి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రభుత్వం జారీ చేస్తున్న పాస్ పుస్తకాలు ఉన్న రైతులకే చెక్కులు అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా సమాచారం. 


ఈ పధకానికి 72 లక్షల మంది అర్హులైన రైతులున్నట్లు గుర్తించగా వారిలో 67 లక్షల మంది వివరాలను అధికారులను ప్రభుత్వానికి అందజేశారు. అయితే వారిలో 57 లక్షల మందికి మాత్రమే పాస్ పుస్తకాలు అందజేయవచ్చని వ్యవసాయ శాఖకు సిఫార్సు చేసినట్లు తాజా సమాచారం. అదే నిజమైతే దాదాపు 15 లక్షల మంది రైతులకు ఈ ప్రయోజనం అందే అవకాశాలు ఉండవని స్పష్టం అవుతోంది. ఈ నెల 24వ తేదీలోగా మిగిలిన రైతుల పూర్తి వివరాలను వ్యసాయ శాఖకు అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. ప్రభుత్వం జారీ చేస్తున్న కొత్త పాస్ పుస్తకాలలో ఎటువంటి తప్పులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే వాటి నమూనా కాపీలను ప్రింట్ తీసుకొని రైతులకు అందజేసి వారికి కూడా పరిశీలించుకొనే అవకాశం కల్పించాలని ఆదేశించారు. 

వచ్చే నెల 19 నుంచి పంట పెట్టుబడి చెక్కుల పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించినందున వీలైనంత త్వరగా పాస్ పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తహసిల్దార్లు అందరూ తమ వంతు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వాస్తవానికి మార్చి 11 నుంచే రాష్ట్రంలో రైతులందరికీ పాస్ పుస్తకాల పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్యి ప్రకటించారు. కానీ నేటికీ పాస్ పుస్తకాల ప్రింటింగ్ పై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. రైతుల పేర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉండి ఉంటే వాటిని సవరించడం తేలికే కానీ భూమి వివరాలు లేదా భూయాజమాన్య హక్కులలో చిన్న తేడా ఉన్నా వాటిని సవరించడం చాలా కష్టమైనా పనే. సంక్లిష్టమైన ఈ పనులన్నీ ముగించి ఏప్రిల్ మొదటివారంలోగా పాస్ పుస్తకాల పంపిణీ చేయగలిగితేనే పంట పెట్టుబడి చెక్కులను సకాలంలో అందించడం సాధ్యం అవుతుంది. కనుక సకాలంలో అర్హులైన రైతులందరికీ చెక్కులు అందుతాయో లేదో చూడాలి.