ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలో మెండోర మండల కేంద్రంలో ఒక ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోవడంతో దానిలో ఉన్న ఐదుగురు చిన్నారులతో సహా మొత్తం 11 మంది మరణించారు.
ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంటకు ముప్కాల్ మండల కేంద్రం నుంచి సావల్ గ్రామానికి అటో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ శ్రీనివాస్ దురాశతో ఏడుగురు ప్రయాణికులు మాత్రమే పట్టే ఆటో రిక్షాలో ఏకంగా 20మందిని ఎక్కించుకొని బయలుదేరాడు. అంతమందిని ఆటోలో ఎక్కించుకోవడమే చాలా కష్టం. చాలా ప్రమాదం. ఆటోలో అంతమంది ఉన్నా అతను ఆటోను చాలా వేగంగా నడపడంతో అది అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. చనిపోయినవారిలో ఐదుగురు పిల్లలు, ఆరుగురు పెద్దవారు ఉన్నారు. డ్రైవరుతో సహా మిగిలినవారు ఆ బావిలో ఉన్న మోటారు పైపులను పట్టుకొని వ్రేలాడుతూ ప్రాణాలు కాపాడుకోగలిగారు.
చనిపోయినవారిలో చిట్టాపూర్ కు చెందిన రోజా (27) ఆమె ఇద్దరు పిల్లలు చక్కని (6) చిన్నా (2), కోడిచెర్లకు చెందిన మెట్టు వినయశ్రీ (6), మోస్రాకు చెందిన పెద్దోళ్ళ సంపత్ (14), కేశాపురానికి చెందిన కాసారపు గంగవ్వ (41), గుండం గంగామణి (45), నాగంపేటకు చెందిన సాయమ్మ (50), ధర్మోరకు చెందిన మద్దికుంట లక్ష్మి (45) ఉన్నారు.
ఈ ప్రమాదం సంగతి తెలుసుకొన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని వారిని కాపాడారు. తరువాత బావిలో శవాలను, ఆటో రిక్షాను వెలికితీసి శవాలను పోస్ట్ మార్టం కొరకు ఆర్మూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణాలు ఆటో డ్రైవర్ శ్రీనివాస్ కు అటో నడిపిన అనుభవం లేకపోవడం, అతివేగం, ఆటో సామర్ధ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడమేనని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని ఆటో డ్రైవర్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశారు.