టి-కాంగ్రెస్ మళ్ళీ బస్సు యాత్రకు రెడీ

తెలంగాణా కాంగ్రెస్ నేతలు మళ్ళీ ఏప్రిల్ 1నుంచి రాష్ట్రంలో బస్సు యాత్ర మొదలుపెట్టబోతున్నారు. ఈనెలలో చేపట్టిన మొదటి విడత బస్సు యాత్రకు పార్టీలో కొందరు నేతలు సహకరించకపోవడంతో ఒకరోజు ముందుగానే అంటే మార్చి 10నే ముగించవలసి వచ్చింది. కనుక ఈసారి అందరూ సహకరించి బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం రామగుండంలో బస్సు యాత్ర మొదలవుతుంది. ఏప్రిల్ 2న పెద్దపల్లి, 3న మంధని, భూపాలపల్లి, 4న పరకాల, వరంగల్ (పశ్చిమ), 5న నర్సంపేట, 6న స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, 7న మహబూబాబాద్, డోర్నకల్, 8న ఇల్లందు, పినపాకలో బస్సుయాత్ర, బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఆరోజు రాత్రి భద్రాచలంలో బసచేసి మర్నాడు శ్రీరాములవారిని దర్శనం చేసుకొని మళ్ళీ వెంకటాపురం నుంచి మళ్ళీ బస్సుయాత్ర ప్రారంభిస్తారు. ఏప్రిల్ 10న కమలాపురం, ములుగు, 11న వరంగల్ (తూర్పు), వర్ధన్నపేటలో బస్సుయాత్ర నిర్వహిస్తారు.  

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వం రద్దు చేసి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ బడ్జెట్ సమావేశాల ముగిసేవరకు సస్పెండ్ చేసినందున, ఈసారి బస్సుయాత్రలో టి-కాంగ్రెస్ నేతలకు తెరాస సర్కార్ ను విమర్శించేందుకు మంచి బలమైన ఆయుధం లభించినట్లయింది. కనుక ఈసారి బస్సు యాత్రలో టి-కాంగ్రెస్ నేతలు మరింత తీవ్ర స్థాయిలో తెరాస సర్కార్ పై విమర్శలు చేయడం ఖాయం. తెరాస నేతలు కూడా వాటిని అదే స్థాయిలో తిప్పికొట్టడం ఖాయం కనుక రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కూడా ఇంకా వేడెక్కవచ్చు.