గత ఏడు దశాబ్దాలుగా దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన పాలకులు కులవృత్తులు చేసుకొనేవారిని ప్రోత్సహించకపోగా వారి జీవనోపాధిని దెబ్బ తీసేవిధంగా వ్యవహరించారు. ఆ కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది తమ కులవృత్తులు చేయడం మానుకొని వలస కూలీలుగా మారిపోయారు. ఇది పైకి కనబడని సామాజిక విద్వంసమేనని చెప్పవచ్చు.
వివిధ కులవృత్తులు చేసుకొనేవారు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే గొప్ప ‘మానవ వనరులు’గా గుర్తించింది ముఖ్యమంత్రి కెసిఆరే. గొర్రెల పెంపకంలో మెళకువలు తెలిసిన గొల్ల కురుములకు గొర్రెలను అందించినట్లయితే, వాటితో వారు రాష్ట్రానికి గొప్ప ఆదాయ వనరును సృష్టించగలరని గుర్తించింది కెసిఆరే. అలాగే మిషన్ కాకతీయ పధకంలో భాగంగా పూడిక తీసి మంచినీటితో నింపిన చెరువులలో చేప పిల్లలను విడిచిపెట్టినట్లయితే మత్స్యకారులకు ఉపాధి మార్గం చూపవచ్చని చెప్పింది కెసిఆరే.
అందుకే తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వివిధ కులవృత్తులు చేసుకొనేవారికి ప్రభుత్వం అవసరమైన సహాయసహకారాలు అందిస్తూ వారిని ప్రోత్సహించడం మొదలుపెట్టింది. వారిలో గీత కార్మికులు కూడా ఒకరు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న గీత కార్మికులపై అనేక వరాలు కురిపించారు.
1. ఇంతవరకు కల్లుగీత సొసైటీలలో సభ్యులకు మాత్రమే నెలకు రూ.200 పెన్షన్ లభించేది. కానీ ఇక నుంచి ట్రీ ఫర్ ట్యాపర్’ (టి.ఎఫ్.టి)పేరుతో కల్లు తీసే ప్రతీ గీతకార్మికుడికి నెలకు రూ.1,000 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. దీని వలన రాష్ట్రంలో సుమారు 30,000 మంది గీత కార్మికుల కుటుంబాలు లబ్ది పొందుతాయి.
2. టి.ఎఫ్.టి. కార్మికులు తాడీ కోపరేటివ్ సొసైటీలో సభ్యులుగా చేరాలనుకొన్నట్లయితే వారికి 10 రోజులలోనే చేర్చుకోబడతారు.
3. చెట్లపన్ను రద్దు చేయబడింది.
4. గీత కార్మికులకు ప్రస్తుతం ఉన్న ఐదేళ్ళ లైసెన్స్ రెన్యువల్ గడువు పదేళ్లకు పెంచబడింది.
5. హరితహారంలో భాగంగా రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఇతర రోడ్ల పక్కన, చెరువుల కట్టలపైనా, కాలువలు, సాగునీటి ప్రాజెక్టుల పరిసర ప్రాంతాలలో ఈత, తాటి, ఖర్జూరం చెట్లు నాటి పెంచబడతాయి. రాష్ట్రంలో ఇప్పటికే గత మూడేళ్ళలో ఈ పధకంలో భాగంగా 70 లక్షల మొక్కలు నాటబడ్డాయి.
6. హైదరాబాద్ నగరంలో 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.5 కోట్ల వ్యయంతో గౌడ భవనం నిర్మించబడుతుంది.