నాగం జనార్ధన్ రెడ్డి భాజపాకు గుడ్ బై చెప్పేశారు. గురువారం ఉదయం నుంచి ఆయన నాగర్ కర్నూల్ లో తన అనుచరులతో సమావేశమయి పార్టీ వీడటం గురించి చర్చించారు. అనంతరం భాజపాను వీడుతున్నట్లు ప్రకటించారు. అయన తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించారు. తెరాస సర్కార్ అవినీతికి వ్యతిరేకంగా తను చేస్తున్న పోరాటానికి రాష్ట్ర భాజపా నేతలు ఎవరూ మద్దతు పలుకనందున అసంతృప్తితో పార్టీని వీడుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
అయన భాజపాలో చేరినప్పటి నుంచే దానిలో ఇమడలేక చాలా ఇబ్బందిపడ్డారు. రాజకీయాలలో సుదీర్గమైన అనుభవం కలిగిన తనకు పార్టీలో చాలా ప్రాధాన్యత లభిస్తుందని ఆశించి భంగపడ్డారు. ఆ అసంతృప్తి కారణంగానే రాష్ట్ర భాజపా నేతలతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తుండేవారు. చివరికి డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మార్గం ఏర్పాటు చేసుకొన్నారు. అయితే నాగం రాకను డికె అరుణ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని వారు డిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఆయనను చేర్చుకొంటే జిల్లాలో ఆయనకు సహకరించబోమని చెప్పారు. కానీ నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయం అయినట్లే. కనుక ఇక నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టినట్లే భావించవచ్చు.