తెలంగాణా బాటలో కర్ణాటక!

రాష్ట్రంలో రైతులందరికీ పంట పెట్టుబడిగా ఎకరానికి రూ.4,000 చొప్పున అందించాలనే తెలంగాణా ప్రభుత్వం ఆలోచన ఇంకా అమలుచేయక మునుపే కేంద్రంతో సహా ఇరుగుపొరుగు రాష్ట్రాలు ఈ పధకంపై ఆసక్తి చూపుతుండటం, ఆ పధకం యొక్క విశిష్టతను తెలియజేస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పధకం ప్రకటించినప్పుడే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య దానిపై ఆసక్తి కనబరిచారు. తెలంగాణా ప్రభుత్వం త్వరలో ఆ పధకాన్ని అమలుచేయడానికి సిద్దం అవుతుండటంతో ఆ పధకానికి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు కర్ణాటక ఈ-గవర్నెన్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజీవ్ చావ్లా హైదరాబాద్ వచ్చి రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి సి.పార్థసారథి తదితరులతో సమావేశమయ్యారు. ఈ పధకాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలుచేయలనుకొంటున్నట్లు తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే ఈ పధకానికి సంబంధించి విధివిధానాలు రూపొందించి, అన్ని పనులు పూర్తి చేసింది కనుక ఆ వివరాలను ఆయనకు అందజేశారు. కర్ణాటక శాసనసభకు ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఆలోగా ఈ పధకాన్ని అమలుచేయగలిగితే రాష్ట్రంలో రైతులను ఆకట్టుకోవచ్చని భావిస్తోంది.