ముఖ్యమంత్రి తరువాత ప్రభుత్వాన్ని నడిపించేది ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సిఎస్). రాష్ట్రంలో యావత్ ప్రభుత్వ శాఖలు, వాటి అధికారులు అందరూ అయన లేదా ఆమె ఆదేశాలను పాటిస్తారు. అటువంటి వ్యక్తిని గదిలో బందించి ఎమ్మెల్యేలు చితకబాదారు. అదీ..సాక్షాత్ ముఖ్యమంత్రి సమక్షంలో! ఈ సంఘటన డిల్లీలో నిన్న రాత్రి జరిగింది.
డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో నిన్న రాత్రి సమావేశం జరిగింది. దానిలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, 11 మంది ఆమాద్మీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆమాద్మీ ప్రభుత్వం మూడేళ్ళు పూర్తి చేసుకొన్న సందర్భం ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు ఇవ్వాలని ఇదివరకే నిర్ణయించారు. కానీ వాటికి సంబంధించిన ఫైల్ సిఎస్ వద్దే ఆగిపోయింది. దీనిపై వారు చర్చించిన తరువాత సిఎస్ అన్షు ప్రకాష్ ను వెంటనే ముఖ్యమంత్రి నివాసానికి రమ్మని కబురు పంపించారు. అప్పుడు సమయం రాత్రి 11.30 అయ్యింది. అయన లోపలకు రాగానే, ఎమ్మెల్యేలు తలుపులు మూసి, ప్రకటనలు ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని గట్టిగా నిలదీశారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకొంటునందున ఆలస్యం అయ్యిందని అయన సమాధానం చెప్పారు. దానితో తీవ్ర ఆగ్రహం చెందిన ఆమాద్మీ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారు. ఆయన అతి కష్టం మీద వారి నుంచి తప్పించుకొని బయటపడి అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి అమాద్మీ ఎమ్మెల్యేలపై పిర్యాదు చేశారు. ఈ సంగతి తెలుసుకొని డిల్లీ సచివాలయంలో పనిచేస్తున్న 7,000 మంది ఉద్యోగులు ఈరోజు ఉదయం నుంచి విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నారు. ఐఏఎస్ అధికారుల సంఘం ప్రతినిధులు డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్ ను, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమక్షంలోనే సిఎస్ అన్షు ప్రకాష్ పై జరిగిన దాడి గురించి పిర్యాదు చేశారు.