తెలంగాణా రాష్ట్రంలో చాలా జోరుగా ఐటి, పరిశ్రమలు, సాగునీరు, మౌలికవసతుల రంగాలలో అభివృద్ధి జరుగుతున్నందున, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో జనాభా కూడా అంతే వేగంగా పెరిగిపోతోంది. నానాటికీ పెరిగిపోతున్న జనాభా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ లో మోనో రైల్ సర్వీసు లేదా ట్రామ్ లేదా హైదరాబాద్ కు అనుకూలమైన మరేదైనా ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పదిమంది నిపుణులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అరవింద్ కుమార్ కన్వీనర్ గా ఉండే ఈ కమిటీలో ఐటి సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో రైల్ ఎండి ఎన్విస్ రెడ్డి, ఎల్&టి హైదరాబాద్ మెట్రో సి.ఈ.ఓ., గ్రీన్ కో ఏనార్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీ.ఈ.ఓ, ఫోనిక్స్ గ్రూప్ చైర్మన్, మీనాక్షి గ్రూప్ చైర్మన్, ఆర్.ఎం.జెడ్.కార్పోరేషన్ చైర్మన్, సాలార్ పూరియా గ్రూప్ ఎం.డి., రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్ తదితరులు సభ్యులుగా ఉంటారు.
హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసు ఫేస్-2,3 లకు సంబంధించిన అంశాలపై కూడా ఈ కమిటీయే అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. అంతగాకుండా రాబోయే 50 సం.లలో హైదరాబాద్ నగరానికి 100 కిమీ పరిధిలో పెరుగాబోయే జనాభా, ట్రాఫిక్ తదితర అంశాలపై కూడా అధ్యయనం చేసి, అందుకు తగిన ఏర్పాట్లను సూచించే బాధ్యత ఈ కమిటీకే అప్పగించబడింది. ఈ కమిటీ వీటిపై లోతుగా అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించి ఇచ్చిన తరువాత దానిని బట్టి నగరానికి తగిన ప్రజా రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.