తెలంగాణా ఎన్నికల సంఘానికి రజత్ కుమార్ ను ప్రధాన అధికారిగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బిహార్ కు చెందిన అయన 1991 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. 2001-2002 మద్య రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఉప కార్యదర్శిగా చేశారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలలో వివిధ హోదాలలో పనిచేశారు. అనంతరం మహబూబ్ నగర్, విజయనగరం జిల్లాల కలెక్టర్ గా చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా నియమింపబడే వరకు అయన తెలంగాణా రాష్ట్ర అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో ఎన్నికల సంఘంలో పనిచేసిన అనుభవం కలిగి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ముగ్గురు అధికారుల జాబితాలో రజత్ కుమార్ పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ ఏడాది చివరిలో లేదా 2019 మార్చిలోగా సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మద్య యుద్ధవాతావరణం నెలకొని ఉంది. రానున్న రోజులలో అది మరింత తీవ్రమవుతుంది. కనుక రజత్ కుమార్ అన్ని పార్టీలతో సమానదూరం పాటిస్తూ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది.