డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకమునుపు తమతో శారీరక సంబంధాలు కలిగి ఉండేవని కొంతమంది మహిళలు ఒకరి తరువాత మరొకరు మీడియా ముందుకు వచ్చి చెపుతుంటే, ట్రంప్ గారి రాసలీలలు గురించి తెలుసుకొని అందరూ ముక్కున వేలేసుకొంటున్నారు. ఆ దేశంలో ఇవన్నీ ‘కామన్’ అని జనాలు ‘లైట్’ తీసుకోవచ్చు కానీ భారత్ లో మాత్రం అటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి.
ప్రస్తుతం అరుణాచల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ప్రేమా ఖండు, మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి 2008లో అంటే పదేళ్ళ క్రితం తనపై అత్యాచారం చేశారని ఒక యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. ఆ సమయంలో తాను స్పృహలో లేనని ఆమె తెలిపింది. ప్రేమా ఖండు ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక తన మాటలను ఎవరూ నమ్మడం లేదని, కేవలం ప్రచారయావతోనే చేస్తున్నానని అందరూ భావిస్తున్నారని తనకు తెలుసునని కానీ తనపై అత్యాచారానికి పాల్పడినవారికి చట్టప్రకారం శిక్షపడేలా చేయడమే తన లక్ష్యమని అంతవరకు న్యాయపోరాటం చేస్తూనే ఉంటానని ఆ యువతీ చెప్పింది. జాతీయ మహిళా సంఘం సహాయంతో ఒక మహిళా న్యాయవాది ద్వారా ఈటానగర్ లో ఆమె పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే పదేళ్ళ క్రితం ఈ ఘటన జరిగితే ఇంతకాలం ఆమె పోలీసులకు ఎందుకు పిర్యాదు చేయకుండా, తాపీగా ఇప్పుడు పిర్యాదు చేసినందున సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు వస్తున్నాయి.