కరీంనగర్ తెరాస ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ 12వ డివిజన్ తెరాస కార్పొరేటర్ మెండి శ్రీలత తెరాసకు రాజీనామా చేశారు. ఆదివారం ఆమె స్థానిక రోడ్లు, భవనాలశాఖ అతిధి గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “గంగుల కమలాకర్ మా పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ, పార్టీలో నావంటి మహిళలను వేధిస్తున్నారు. గతంలో 30వ వార్డుకు చెందిన జయశ్రీ అనే కార్పొరేటర్ కూడా అయన వేధింపులు భరించలేకే పార్టీని విడిచిపెట్టారు. మేము దళితులమనే కారణంగానే ఆయనకు మాపట్ల చిన్నచూపు ఉంది. మావార్డుల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి అయన ఏమత్రం సహకరించకపోగా వాటికోసం అడుగుతున్న నావంటి వారిని వేధిస్తున్నారు. చివరకు నాభర్త మెండి చంద్రశేఖర్ పై పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయించారు. ఎమ్మెల్యే వేధింపులు భరించలేకనే నేను పార్టీని వీడుతున్నాను. నా భర్తకు ఏదైనా హాని జరిగితే ఎమ్మెల్యే ఇంటి ముందే ఆత్మహత్య చేసుకొంటాను,” అని హెచ్చరించారు.